Loading...
DGS Dhinakaran

ఆదరణ పూరితమైన దయగల మాటలు దీవెనలిచ్చును!

Bro. D.G.S Dhinakaran
05 Dec
నా ప్రియులారా, ఈ లోకములో జీవించే మనకు ప్రత్యేకమైన జ్ఞానము ఎంతో అవసరమైయున్నది. ఎందుకంటే, ఈ లోకము దుష్టుని యందున్నది. కాబట్టి, " జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును; వాని పెదవులకు విద్య విస్తరింపజేయును '' (సామెతలు 16:23) అన్న వచనము ప్రకారము కొన్ని సమయాలల్లో మనము ఏమి మాట్లాడుచున్నామో, అవగాహన లేకుండా మాట్లాడుతాము. అటుతరువాత, అటువంటి మాటలను మాట్లాడి యుండకూడదని గ్రహించి, మనము మాట్లాడిన పదాలు మన పరిస్థితులను బట్టి వచ్చాయని మనలను మనమే నిందించుకుంటాము. నేడు అదే మనకు బైబిల్ గుర్తుచేస్తున్నది, " జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు '' (సామెతలు 18:21) అన్న వచనము ప్రకారము మన మాటలలో అంత శక్తి ఉన్నది. 

నా ప్రియులారా, " బీదలకు సువార్తను ప్రకటించుటకే యేసుక్రీస్తు అభిషేకించబడెను '' (లూకా 4:18). అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి '' (సామెతలు 16:24) అన్న వచనము ప్రకారము ఇంపైన మాటలనే ఎప్పుడు మనము పలకాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. యేసుక్రీస్తు ఎల్లప్పుడు, ఆదరణ పూరితమైన మరియు కృపగలిగిన మాటలనే ప్రజలతో మాట్లాడెను. 
ఒకరోజు ఒక పక్షవాయువు కలిగిన మనుష్యుని జనులు యేసునొద్దకు తీసుకొని వచ్చిరి. బైబిలేమంటుందో చూడండి, " మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును '' (1 సమూయేలు 16:7) అన్న వచనము ప్రకారము యేసు ఆ వ్యక్తి యొక్క గత జీవితాన్ని గుర్తించి, ఇతని యొక్క పాపము వలన కలిగిన వ్యాధి అని గుర్తించాడు. అయితే, అతడు పశ్చాత్తాపముతో యేసునొద్దకు తీసుకొని రాబడెను. అతనిని చూచి, యేసు హృదయము కనికరముతో నింపబడినది. అతడు పాపములో మునిగినందున ఎవరు కూడ అతని ఇష్టపడలేదు. తద్వారా అతడు పూర్తిగా వికలాంగునిగా మారెను. యేసు అతనితో " నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి, '' అని చెప్పెను. ఆయన యొద్ద నుండి వచ్చిన దయగల మాటల చేత అతడు సంపూర్ణంగా స్వస్థపరచబడెను. అవును, ప్రభువైన యేసుక్రీస్తు దయ కనికరము మరియు సమాధానము కలిగిన మాటలనే బోధించుటకు పంపబడెను. 

నా ప్రియులారా, యేసుక్రీస్తు ఏ మానవుని శిక్షించడానికి ఈ లోకమునకు రాలేదు. అపవాది శక్తి నుండి విడిపించడానికి మరియు రోగులను స్వస్థపరచుటకే ఆయన దిగివచ్చెను. మనము దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దయగల మరియు ఆదరణ పూరితమైన మాటలనే మాట్లాడతాము. యేసుక్రీస్తు ఆత్మచేత జన్మించుట ద్వారా ఆయన ఏదైతే, చెప్పెనో ఆవిధంగానే జరిగించాడు. బైబిల్లో, " ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును '' (రోమా 10:10) అన్న వచనము ప్రకారము మీరు హృదయములో విశ్వసించి, నోటితో ఒప్పుకున్నప్పుడు, మీరు ఏది మాట్లాడిన అది జరుగుతుంది. " అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది '' అని మనము ఒప్పుకొన్నట్లయితే, మనకు స్వస్థత కలుగుతుంది. కానీ, దానికి విరుద్ధంగా సణుగుకొనకండి. అదేవిధంగా, మీరు కష్టమైన పరిస్ధితులను ఎదుర్కొంటు, ఆ స్థితి నుండి బయటకు రాలేకపోవచ్చును. అయితే, మీరు మీ పాపములను ఒప్పుకొన్నట్లయితే, నిశ్చయముగా, " మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము '' అని చెప్పినట్లుగానే, మీరు కూడ " నేను అన్నిటిలో అత్యధిక విజయము పొందుతాను '' అని చెప్పండి. అప్పుడు మీరు తప్పకుండా విజయమును పొందుకుంటారు. అంతేకాదు, మీరు వాగ్దానపు మాటలను ఇతరులతో మాట్లాడినప్పుడు అవి వారికి కూడ ఆశీర్వాదకరముగా ఉంటాయి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఏమి మాట్లాడినను జాగ్రత్తగా మాట్లాడండి. ఇంతవరకు కఠినమైన మాటలతో మాట్లాడినట్లయితే, ఈరోజే ప్రభువు యొద్దకు రండి, ఆయన మీ నోటి దయగల మాటలతో నింపి, అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు. 
Prayer:
ప్రేమా నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, నీ కుమారుని ఈ లోకమునకు పంపించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీవు ఏలాగున దయగల మరియు సమాధానకరమైన మాటలను బోధించావో, ఆలాగుననే, మేము కూడ చేయుటకు నీ కనికరముతో మమ్ములను నింపుము. ఎల్లప్పుడు, మా నోట ఇంపైన మాటలను మాట్లాడుటకు మా నాలుకను మరియు నోటిని నీ యొక్క వాక్ శక్తితో నింపుము. నేడు మా పాపము ద్వారా కలిగిన వ్యాధిని నీ దయగల మాట ద్వారా స్వస్థపరచుము. ఇతరులతో మేము మాట్లాడునప్పుడు ఎంతో జాగ్రత్తగలవారై యుండునట్లు సహాయము చేయుము. మేము అనేకులకు ఆశీర్వాదకరమైన మాటలను మాట్లాడుటకు అటువంటి కృపతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000