Loading...
Dr. Paul Dhinakaran

శత్రువులను జయించే ఇంద్రియ నిగ్రహముగల ఆయుధం!

Dr. Paul Dhinakaran
12 Jul
నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలములలో, " భయపడకు, నేను నీతో కూడ ఉన్నాను '' అని విభిన్న స్థలములలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ' భయం ' అనేది దేవుని యొక్క ఉద్దేశంతో ముందుకు సాగకుండా ఉండటానికి అపవాది ఉపయోగించే భయంకరమైన ఆయుధం అని మానవజాతి చరిత్రలో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఇది మీ జీవితంలో వేళ్లూనుకోవడానికి అనుమతించకుండా ఉండటానికి, దేవుడు మీకు భయం అనే ఆత్మను ఇవ్వలేదని అన్ని సమయాలలో గుర్తుంచుకోవలెను. ఈ ఆత్మ విజయమును ఇచ్చే గొప్ప శక్తివంతమైన ఆయుధముగా ఉన్నది. నేడు మీ జీవితములో మీరు ఎదుర్కొంటున్న యుద్ధాలను చూచి భయపడుచున్నారా? తద్వారా ఈ లోకములో మీరు ముందుకు కొనసాగలేకపోతున్నారా? భయపడకండి! నేడు దేవుడు మీ పక్షాన యుద్ధము చేసి, మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు సిద్ధముగా వున్నాడు. మీ భయాలన్నిటిని ఎదుర్కొనుటకు పిరికితనముగల ఆత్మను దేవుడు మీకివ్వలేదు. దేవుడు ఇంద్రియ నిగ్రహమును, శక్తిని, ప్రేమగల పరిశుద్ధాత్మను మీకనుగ్రహించి యున్నాడు. కాబట్టి, " దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను, గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు '' ( 2 తిమోతి 1:7) అన్న వచనము ప్రకారము దేవుడు మీకు శక్తి గల ఆత్మ అనే ఆయుధమును ఇచ్చియున్నాడు. కాబట్టి మీరు దేనికి భయపడనవ సరం లేదు, ధైర్యం వహించి మీ జీవిత పయనములో ముందుకుసాగండి, విజయము మీదే. 

బైబిల్లో ఇటువంటి ధైర్యముగల మరియు యుద్ధములో జయము పొందిన ఒక వ్యక్తిని మనము చూడగలము. ఇతడు శత్రువులను ఎదుర్కొనుటలో ఎంతో ప్రావీణ్యము కలిగినవాడు. దావీదు గొల్యాతును యుద్ధములో ఎదుర్కొన్నప్పుడు జరిగినదేమిటి? దావీదు వయస్సులో ఎంతో చిన్నవాడైనప్పటికిని బలాఢ్యుడైన గొల్యాతును యుద్ధములో ఎదుర్కొనడానికి ఐదు గులకరాళ్లను మాత్రం తీసుకెళ్లాడు. యుద్ధ కవచము ధరించి వున్న బలాఢ్యుడైన గొల్యాతును చూచి దావీదు ఏ మాత్రం భయపడలేదు, ధైర్యంగా యుద్ధము చేయుటకు అతని మీదకు వెళ్లాడు. అప్పుడు దావీదును చూచి గొల్యాతు ఏమన్నాడంటే, ' కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనా? అని మన దేవునిని శపించాడు. ' అయితే గొల్యాతును చూచి ధైర్యంగా, ' నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావని ' అన్నాడు. అయితే దావీదు గొల్యాతును చూచి, " నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులతో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును '' (1 సమూయేలు 17:45-47) అని చెప్పి దావీదు ధైర్యంగా గొల్యాతు మీదికి యుద్ధానికి వెళ్లాడు. దావీదు తన చేతిలో అనువుగా వున్న దానిని ఉపయోగించి గొప్ప విజయం సాధించాడు. దేవుడు ఎంతో జ్ఞానయుక్తంగా దావీదుకు విజయాన్ని ఇచ్చి గొల్యాతును పడగొట్టేలా చేశాడు. దావీదు దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించినందుకే అతనిలో ఈ ధైర్యసాహసము, నమ్మకం. " యుద్ధము యెహోవాదే '' అను వచనం ప్రకారం ఆ యుద్ధంలో దావీదుకు విజయం దేవుడు దయచేయుటకు ముందుగానే గొల్యాతుతో ఒక గొప్ప సవాలును విసిరాడు. ఆయుధములతో కాకుండా, చిన్న గులకరాళ్లతోనే దావీదు గొల్యాతును ఓడించి, చంపాడు. దావీదు చిన్నవాడైనప్పటికిని దేవుడు అతనికి శక్తిని ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చి, బలాఢ్యుడైన గొల్యాతును జయించుటకు ధైర్యాన్ని నిచ్చాడు. 
నా ప్రియులారా, ఇది దావీదు ఏలాగున చేయగలిగాడు? దేవుని ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అతని మీద ఉన్నందుననే, దావీదు విజయమును సాధించగలిగాడు. అవును దేవుని ఆత్మ, శక్తియు ప్రేమయు మరియు శత్రువును జయించుటకు ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే అనుగ్రహించును. దేవుని ఆత్మ దావీదు చేతిలో ఉన్న చిన్న గులకరాళ్లను గొల్యాతును జయించే ఒక గొప్ప ఆయుధముగా మార్చెను. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఓటమిని ఎదుర్కొంటు అన్నిటిలోను భయమును కలిగియున్నారా? ఈనాడు ఈ వాగ్దానము మీద విశ్వాసముంచి, మీ చేతిలో ఉన్న చిన్న గులకరాళ్లను, మీ శక్తిని ఉపయోగించినట్లయితే, శత్రువు మీ యెదుట పడుట మీరు చూచెదరు. దేనిని చూచి భయపడకుండా, మీరు నిర్భయంగా ఉంటారు. ఇక్కడ నిబ్బరం అనే మాటకు అర్ధం ఏమంటే ఏ భయం, చింత లేకుండా, ప్రశాంతంగా వుండాలని అర్ధము. కాబట్టి, మీరు ధైర్యంగా అపవాదితో యుద్ధము చేయండి, ఆయన మీకు సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన శక్తి జ్ఞానంతో మిమ్మును నింపి మీతో పాటు ఆయన కూడా యుద్ధంలోకి దిగుతాడు. గొల్యాతును కూలగొట్టాక దావీదు పరుగెత్తికెళ్లి గొల్యాతు తల తెగనరికాడు. ఆలాగున మీ భవిష్యత్తు ద్వారా గొప్ప కార్యములు ఆ ప్రభువు చేయగోర్తున్నాడు. మీ విశ్వాసంతో పాటు మీ హృదయం అనే సంచిలో రాళ్లు కూడా వుండాలి. అపవాది వచ్చినప్పుడు ఆత్మీయ ఆయుధము కోసం ఆఖరి క్షణం పరుగెత్తలేరు కదా. కనుక మీలో పరిశుద్ధాత్మ శక్తిని ఆయుధంగా వుంచుకోవాలి. ఆ పరిశుద్ధాత్ముడు మీ కన్నులను తెరచి యుద్ధము చేయుటకు శక్తి నిచ్చి విజయవంతులనుగా మారుస్తాడు. 

నా ప్రియులారా, ఈ లోక సమస్యలను చూచి మీరు పిరికి వారుగా భయపడుచున్నారా? భయపడకండి, దావీదును ధైర్యపరచి బలాన్ని శక్తిని, విజయాన్ని అనుగ్రహించిన దేవుడు తప్పక మీకును శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మను మీ కిచ్చి మిమ్మును ధైర్యవంతులనుగా మార్చి తన ప్రేమచేత మిమ్మును కౌగలించుకొని, మీ శ్రమలన్నింటిని అధిగమిస్తూ, మీ అభ్యుదయ జీవితంలో ఉన్నతులై జీవించుటకు మీలో వున్న పిరికితనముగల ఆత్మను మీ నుండి తొలగించి దేవుడు తన శక్తిగల ఆత్మను మీకిచ్చి మిమ్మును విజయవంతులనుగా చేసి ఆశీర్వదించును గాక!
Prayer:
ప్రేమ కనికరముగల పరలోకపు తండ్రీ, 

నీ పరిశుద్ధాత్మను శక్తిగల ఆత్మను మాకు ప్రసాదించుము. యేసుక్రీస్తువలె మమ్మును నీ ఆత్మ చేత రూపాంతరపరచుము. మమ్మును శిక్షించి, దండించి, ఖండించి, నీకు మహిమకరముగా దావీదువలె వాడుకొనుము. దేవా, ఈ లోకములో జీవించే మాకు మాలో వున్న పిరికితనముగల ఆత్మ తీసివేసి మమ్మును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతోను, శక్తితోను నింపుము. ఈలోకములో కలుగు యుద్ధాలన్నిటిలోను, మా శోధనలన్నిటిలోను నీవు మా పక్షముగా వుండి యుద్ధము చేయుము. యుద్ధము యెహోవాదే అన్న వాక్యము ప్రకారము మేము మా యుద్ధమను భారమును నీపై మోపుచున్నాము. కావుననే, దావీదువలె మమ్మును ధైర్యపరచుచు కన్నీటిలో వున్న మాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చి దావీదు వలె ధైర్యంగా ఈ లోక యుద్ధమును జయించుటకు శక్తిని దయచేయుము. ఎల్లప్పుడు మమ్మును విజయవంతులనుగా మార్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000