Loading...
Dr. Paul Dhinakaran

దేవుడు తన చేతి నీడలో మిమ్మల్ని కప్పియున్నాడు!

Dr. Paul Dhinakaran
11 Sep
నా ప్రియులారా, నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని తన చేతి నీడలో కప్పాలని మీ పట్ల కోరుచున్నాడు. బైబిల్లో ప్రవక్తయైన యిర్మీయాను చూచినట్లయితే, యూదాలోని ఐదుగురు రాజుల యేలుబడి కాలములో దేవుని ప్రవక్తలలో ఒకనిగా యిర్మీయా పరిచర్య చేశాడు. దేవుడు యిర్మీయాను జనుల మీదను, రాజ్యముల మీదను ప్రవక్తగా నియమించెను. అతని యొక్క ప్రవచనాత్మకమైన పరిచర్య నలభై సంవత్సరములకు పైగా విస్తరించినది. అవును, అతను గొప్ప ప్రవక్తయై యున్నాడు. అయితే, దేవుడు యిర్మీయాని తన సేవ నిమిత్తమై అతనిని పిలిచినప్పుడు, అతనికి పదిహేడు సంవత్సరములు మాత్రమే. కానీ, దేవుడు అతడు బాలుడైయున్నప్పుడు అతనిని పిలిచెను. మరియు యిర్మీయా మాటలాడుటకు నాకు శక్తి చాలదని చెప్పెను. అప్పుడు దేవుడు అతనితో, " యిర్మీయా నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని... '' (యిర్మీయా 1:5) మరియు దేవుడు మరల యిర్మీయాతో, " నీ నోట నా మాటలు ఉంచి, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను '' (యెషయా 51:16) అని చెప్పెను. నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ లోకములో దేవుని పరిచర్య నిమిత్తం భయం మీకు ఒక గొప్ప సమస్యగా ఉండవచ్చును. ఈ రోజు ఆ భయం అను ఊబి నుండి బయటకు వచ్చి, ఆయన యొక్క శక్తివంతమైన చేతులలోనికి మరియు రెక్కల నీడలోనికి మీరు సురక్షితంగా ఉండునట్లు ఆయన యొద్దకు చేరుకొనండి. ఈనాడు దేవుడు మిమ్మును కూడ యిర్మీయా వలె ఏర్పరచుకొనియున్నాడు. అదేవిధంగా దేవుడు కూడ తల్లి గర్భములోనే రూపింపబడక మునుపే మీ పట్ల తన ఉద్దేశమును నెరవేర్చుట కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాడని మీరు మరవకండి.

సైబర్ ఫోబియా అమెరికాలో ఉన్న సరికొత్త భయాలలో ఇది ఒకటి. జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయంలోని వ్యాపారవేత్తలు మరియు ప్రొఫెసర్ల బృందం అభిప్రాయం ప్రకారం, కంప్యూటర్ల పట్ల తీవ్రమైన భయం పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ప్రజలు అంగీకరిస్తున్నారు అని తెలియజేశారు. కారణము, చాలా మంది ప్రజలు ఒకే గదిలో ఉండటము వలన వారిలో భయాందోళనలు, సక్రమంగా లేని హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మైకము, వణుకు వంటి భావాలతో బాధపడుతున్నారు. కంప్యూటర్లతో పనిచేయడం నేర్చుకునేటప్పుడు ఈ వ్యక్తులు సాధారణ వైఫల్యం కంటే భయంతో ఎక్కువగా ఉన్నారని ఒక చికిత్సకుడు తెలియజేశాడు. అటువంటి సమయములో వారు చాలా భయాక్రాంతులుగా మారతారు. వారు బయటకు వెళ్తారనియు, పిచ్చిగా మారతారనియు లేదా నియంత్రణ కోల్పోతారని వారు భయపడుతున్నారు. దీనికి ఏదైనా అర్థమున్నదా? లేదు, కానీ, భయం ఒక వ్యక్తిలో చాలా బాధను కలిగిస్తుంది. మరొక భయం ఏదనగా, ఇతరుల అభిప్రాయాలు మరియు పనుల పట్ల భయం! దాదాపు ఇందులో అందరు చిక్కుకొని యున్నారని తెలియజేయబడినది.
నా ప్రియులారా, యిర్మీయా దేవుని యెదుట తన బలహీనతతో వాదించినట్లుగా మీరు కూడ ఆయనను విశ్వసించడం మానేస్తున్నారా? భయం మిమ్మల్ని పట్టుకొనియున్నదా? ఆలాగైతే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము యొక్క ప్రతి వివరణ పట్టి సురక్షితంగా ఉన్న గొప్ప దేవుని వైపు చూడండి. ఈ లోకము అనేకమైన భయాలతో నిండుకొనియున్నది. అయితే, దేవుడు మీకిచ్చిన గమ్యంను చేరుకొనుటకు మీకు ఇది ఒక ఆటంకముగా ఉండకూడదు. మీ భయాలన్నిటినీ తన ప్రేమగల రెక్కలతో కప్పే ఆయన స్వాధీనములోనికి తీసుకురండి. తన ఉద్దేశము కొరకు మిమ్మల్ని ఎన్నుకొన్న దేవుడు వేసారి లేదా సొమ్మసిల్లి అలసిపోలేదు. మిమ్మల్ని రక్షించుటకు ఆయన చేతులు కురచకాలేదు. " నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను '' అని యిర్మీయా పట్ల చేసిన దేవుని వాగ్దానము యందు మీరు కూడ నమ్మిక యుంచండి, అప్పుడు ప్రభువు కోసం మీరు ఎన్నో మైళ్ల దూరం ముందుకు సాగిపోవచ్చును. ఆయన మీకు సహాయకుడు. మీరు నిరంతరం అణచివేయబడవలసిన అవసరం లేదు. మీలో నుండి వచ్చు భయమును అడ్డుకొని, మీ పట్ల రాజ్యం చేయు గొప్ప దేవుని కలిగియున్నారని మరచిపోకండి. దేవుడు ఎవరో నమ్మండి. విమోచన మరియు మీ అవసరతలను గురించి ఆయన ఇచ్చిన వాగ్దానాలను మీ హృదయంలో అంగీకరించండి.

కాబట్టి, నా ప్రియులారా, నేడు దేవుడు యిర్మీయాను ఉపయోగించుకొనిన ప్రకారము ఆయన మిమ్మును కూడ ఉపయోగించుకొనును. కనునకే, యిర్మీయా వలె, " నేను అర్హుడను కాను, నేను బాలుడను, నేను పాపిని '' అని చెప్పకండి. యేసు మిమ్మును ఆయన రక్తముతో కడిగి, ఆయన బిడ్డలనుగాను మరియు రాజ్యవారసులనుగా మిమ్మును పిలిచియున్నాడు. నిజంగా, మిమ్మల్ని ఒక అధికారం గల వ్యక్తిగా మార్చడానికి దేవుడు తన శక్తివంతమైన పిలుపును మీకు ఇచ్చియున్నాడు. కాబట్టి దిగులుపడకండి, ధైర్యముగా ఉండండి. మీరు తల్లిగర్భములో రూపింపబడక మునుపే ఆయన మిమ్మల్ని ఎరిగియున్నాడు. ఆయన మీ పట్ల జాగ్రత్త వహించియున్నాడు. అటువంటి మీ పట్ల దేవుడు ఒక వాగ్దానమును ఇచ్చియున్నాడు, " కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటన చేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశనివాసుల యొద్దకు గాని, యా దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి యున్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు '' (యిర్మీయా 1:17-19). దేవుడు మిమ్మును ఏర్పరచుకొనియున్నాడు. కనుక ఆనందముగా ఉండండి. మీరు గర్భమున రూపంపక మునుపే దేవుడు మిమ్మును ఎరిగియున్నాడనే నిశ్చయతతో మీరు దేవుని పరిచర్యలోనికి ముందుకు సాగండి, నిశ్చయముగా ఆయన మిమ్మును నడిపిస్తాడు. ఆయన యందు నమ్మిక కలిగి జీవించినట్లయితే, నిశ్చయముగా, తల్లి గర్భములోనే మీరు రూపింపబడకమునుపే మిమ్మును ఏర్పరచుకున్న దేవుడు నిశ్చయముగా, మీ పట్ల ఆయన కలిగియున్న ఉద్దేశాన్ని నెరవేర్చి, మీ పట్ల ఆశ్చర్యకార్యాలను జరిగించి మిమ్మును పరవశింపజేస్తాడు.
Prayer:
కృపామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను ఘనపరచుటకు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మేము తల్లిగర్భములో రూపింపబడకమునుపే, నీవు మమ్మును ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు. ఈ దినమున ఆశీర్వాదకరమైన ఈ వాక్యము ద్వారా మాతో మాటలాడినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుము. నీ వాక్యమును ప్రకటించుటకు మమ్మును నీ యొక్క పాత్రగా ఏర్పరచుకొనినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మా పట్ల నీవు కలిగియున్న ఉద్దేశమును నెరవేర్చుటకు మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. మాలో ఉన్న భయాన్ని తొలగించి, నీ యొక్క నోటి మాటలను మా నోట ఉంచుము. మా జీవితములో నీ తలంపులు నెరవేరునట్లు చేయుము. మానవ మాటలపై నమ్మికయుంచక, నీ శాశ్వతమైన ప్రేమను విశ్వసించి జీవించుటకు కృపనిమ్ము. ఎల్లవేళల నీ యందు న మ్మికయుంచి మెండైన దీవెనలు పొందుటకు సహాయము చేయుము. మా పట్ల నీవు కలిగియున్న ఉద్దేశాన్ని మరియు చిత్తాన్ని నెరవేర్చి, యిర్మీయా వలె మమ్మును కూడ నీ పరిచర్యలో ఉపయోగించుకొనుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

044 - 45 999 000 / 044 - 33 999 000