Loading...

దేవుని పరిపూర్ణమైన ప్రేమ మీలో భయమును వెళ్లగొట్టును!

Sharon Dhinakaran
08 Nov
నా ప్రియులారా, నేడు దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఎందుకంటే, దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమకు సాటి ఈ లోకములో ఏదియు లేదు. దేవుడు మనకు అద్భుతమైన కుటుంబమును మరియు స్నేహితులను, బంధువులను ఇచ్చి మనలను ఆశీర్వదించియున్నాడు. మనము వారిని ప్రేమిస్తాము. కానీ ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందా? అని చూచినట్లయితే, మనము వారి నుండి పొందుకొనే ప్రేమ మధ్య, కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా ఒక భయం మన హృదయాన్ని ఆక్రమిస్తుంది. కానీ, దేవుని వాక్యం ఇలా చెబుతోంది, " ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును...'' (1 యోహాను 4:18) అన్న వచనము ప్రకారము దేవుని ప్రేమ ద్వారా ఆ భయాన్ని మనలో నుండి వెళ్లగొడుతుంది. దేవుని ప్రేమ తప్ప వేరే ప్రేమ పరిపూర్ణంగా మనలో ఉండలేదు. ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమను కలిగియున్నాడని చూచినట్లయితే, " తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు '' (యోహాను 15:13) అని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. ఎందుకంటే, దేవుని పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది మరియు మనకు విజయాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే, దేవుడు మనకు భయపడే ఆత్మను ఇవ్వలేదు. అందుకే లేఖనములో చూడండి, " దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు '' (2 తిమోతి 1:7) అన్న వచనము ప్రకారము ఇంద్రియ నిగ్రహముగల ఆత్మనే మనకు ఇచ్చియున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

ఒక బేస్ బాల్ ఛాంపియన్ ఉండేవాడు మరియు అతడు బేస్ బాల్ ఆట కోసం వెళ్ళబోతున్నప్పుడు అతనికి ఒక క్రొత్త వ్యక్తి నుండి ఫోన్ వచ్చినది మరియు ఆ ఫోన్‌కాల్‌లో ఎవరో అతన్ని బెదిరించెను. అతడు మ్యాచ్ కోసం వెళ్లినట్లయితే, తాను కాల్చి చంపబడతాడని చెప్పెను. అతను తన ఫోన్‌ను పెట్టిన తరువాత, అతను మనస్సులో కలవరం చెందాడు మరియు భయం ఆతని మనస్సు లోపలికి ప్రవేశించెను. అతడు ఆ పెద్ద మైదానము నుండి బయటకు వచ్చి అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? అని చుట్టు కలియ చూశాడు. కానీ, అతన్ని ప్రోత్సహించిన తన తండ్రిని మాత్రమే అక్కడ చూశాడు, అప్పుడు, ఆ తండ్రి తన కుమారుని చూచి, ' చింతించకు, ధైర్యంగా వెళ్లు, నీవు వెళ్లి మ్యాచ్‌లో పాల్గొను, నేను నీ కోసం అన్ని భద్రతలను చేశాను ' అని తన కుమారుని ప్రోత్సహించాడు. ఇది ఒక యువ ఆటగాడిని ప్రేరేపించినది మరియు అతని తండ్రి ఎప్పుడూ తప్పు జరగనివ్వడు అని అతడు నిబ్బరముతో ఆడుటకు వెళ్లెను. అతడు ఎంతో ఉత్సాహంతో ఆటను ఆడాడు మరియు అతని జట్టుకు మరియు అతని కుటుంబానికి కీర్తిని గడించి, ఆ ఆటలో గెలుపొందాడు.
నా ప్రియులారా, నేడు మనము అనేక విషయాలను గురించి భయపడుతు ఉంటాము. జీవితమును గురించి భయం, మరణ భయం, మన భవిష్యత్తును గురించిన భయం, ప్రియమైన వ్యక్తిని కోల్పోతామనే భయం, పరీక్షల భయం మరి ఇంకా ఎన్నో భయాలు మన హృదయములో అనంతంగా సాగుతుంటాయి. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీ భయాలన్నిటి నుండి మీరు జయించుటకు యేసు వైపు చూడండి. మన ప్రభువైన యేసు మార్గంలో మరియు సత్యంలో నడవడం ద్వారా మాత్రమే, సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో ఉన్నాడని మీరు అర్థం చేసుకోగలరు. బైబిల్‌లో, " భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు '' (ద్వితీయోపదేశకాండము 31:6) అన్న వచనము ప్రకారము తన తండ్రి తనను రక్షిస్తాడని పై చెప్పబడిన యువ బేస్ బాల్ ఆటగాడు ఎలా విశ్వసించాడో, మిమ్మల్ని బాధించే దేనికైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ప్రభువుపై నమ్మకం ఉంచడం ద్వారా ఈ లోకములో ప్రవేశించినట్లయితే, జీవిత ఆటను చాలా సముచితమైన మరియు ఆమోదయోగ్యమైన రీతిలో ఆడటానికి మీకు మీరే సిద్ధం చేసుకోవాలి మరియు ప్రభువు మీతో ఉంటాడని మరియు మీకు విజయం ఇస్తాడని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆలాగున చేసినట్లయితే, ప్రభువు తన మార్గాలను మీకు తెలియజేసి, ఆయన చిత్తప్రకారము మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక!
Prayer:
దయ కనికరము గలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీ ప్రేమ ద్వారా మాలో ఉన్న భయాలన్నిటిని తరిమికొట్టినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా తండ్రివి కనుకనే, జీవితాలను కాపాడే దేవుడవు కనుకనే, నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, ఈనాడు వివిధ రకములైన భయాలతో మా హృదయము నిండియున్నది. నీ పరిపూర్ణమైన ప్రేమను నేడు మాలో కుమ్మరించి, మాలో ఉన్న భయాన్ని తొలగించుము. నీ ప్రేమకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులై యుండునట్లు చేయుము. ప్రభువా, నీవు తప్ప పరిపూర్ణమైన ప్రేమ మాలో కుమ్మరించువారెవరు లేరు. కాబట్టి, మాలో ఉన్న నీ యొక్క ప్రేమను ఒకరితో ఒకరు పంచుకునేందుకు మరియు ఈ లోకములో నీ రాజ్యాన్ని కట్టడానికి మాకు సహాయం చేయుము. ఈ రోజు నుండి నీ ప్రేమ చేత మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని కాపాడి సంరక్షించి, సంపూర్ణముగా ఆశీర్వదించుము. దేవా, నీ ప్రేమ మాలో నుండి ఆనందపు నదులుగా ఇతరులలోనికి ప్రవహించునట్లు చేయుమని యేసు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000