Loading...
Dr. Paul Dhinakaran

పాపమెరుగని యేసు మన కోసం పాపముగా మారెను!

Dr. Paul Dhinakaran
09 Dec
నా ప్రియులారా, నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకమునకు దిగివచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు? అని మనము చూచినట్లయితే, " మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను '' (2 కొరింథీయులకు 5:21) అన్న వచనము ప్రకారము, మనము నీతిమంతులుగా మారాలని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. ఎందుకు ఆయన మన కొరకు పాపముగా మార్చబడెను? కారణము, ఆయన మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు. తన బిడ్డలు నశించిపోకూడదనియు, వారు దేవుని రాజ్యమునకు వారసులు కావలెననియు, ఆయన పాపముగా మారెను. మనము పాపము చేసినందువలన, నిత్యనరకమునకు వెళ్లకుండా ఉండాలనియు మరియు మనము నాశనము కాకుండా ఉండాలనియు పాపమెరుగని ఆయన పాపముగా మారుటకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. ప్రభువైన యేసు సిలువలో పొందిన ఘోరమైన మరణం ద్వారా మన కోసం తన జీవితాన్ని త్యాగము చేశాడు. మనము నిత్య జీవమును పొందుకొనుట కొరకై తన మీద మన యొక్క పాపములను, శాపములను మరియు అవమానమును వేసుకున్నాడు. కావుననే, మన క్రియలను బట్టి మనము రక్షింపబడలేదు, కానీ, ఆయన యొక్క కృప ద్వారా మనము రక్షింపబడియున్నాము. 

చెన్నైలోని ఒక పరిశోధనా సంస్థవారు విష జ్వరమునకు ఔషదమును కనుగొన్నారు. మొదటిగా వారు టీకా మందును కనుగొనుటకు ముందుగా వారు రోగమును కలిగించు క్రిమిని గుఱ్ఱముల శరీరములోనికి ఇంజక్షన్ ద్వారా పంపించారు. ఆ మందు వాటి శరీరములోనికి వెళ్లిన తరువాత జ్వరము వచ్చింది. ఆ సమయములో గుఱ్ఱములో ఆ క్రిమికి సంబంధించిన వ్యాధి నిరోధకాలు ఉత్పత్తి అయినవి. ఆ వ్యాధి నిరోధకాలను బయటకు తీసి, టీకా మందును కనుగొన్నారు. వారు కొన్ని పరీక్షల తరువాత, ఆ టీకా మందును వ్యాధిగ్రస్థుల మీద ప్రయోగించారు. అది వారికి పనిచేసినది. మనుష్యులలో ఉన్న రోగములను నివారించుటకు ఉపయోగించుచున్నారు. అవును, ఆ క్రిమి కారణముగా గుఱ్ఱము నొప్పితో విలవిలలాడుతుంది. కానీ, మన ప్రాణాలు కాపాడుటకు వ్యాధి నిరోధకాలు ఉత్పత్తియగుతాయి. అదేవిధముగా, సర్వశక్తిమంతుడైన దేవుడు మన అతిక్రమములను మరియు దోషములను యేసు మీద ఉంచెను. ప్రభువైన యేసు మన కోసము పాపముగా మారెను. సిలువలో కూడ పాపము అను క్రిమిని ఆయన తీసుకొని, ఆయన యొక్క నీతి అను వ్యాధి నిరోధకాలను మనకు అనుగ్రహించాడు. అపవాది బంధకాల నుండి మనలను విడిపించుట కొరకే, ఆయన అవమానకరమైన మరణమును సిలువలో అనుభవించాడు. యేసుక్రీస్తు రక్తము మన పాపములను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రభువైన యేసు తాను అరణ్యములో అపవాది చేత శోధింపబడినను ఎన్నడు ఎటువంటి పాపమును చేయలేదు (మత్తయి 4:1-11). ఇంకను మనము దేవుని యెదుట నీతిమంతులముగా ఉండునటకు యేసుక్రీస్తు మన కొరకు క్రయధనమును చెల్లించాడు. 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ యొక్క పాపములను మరియు శాపములను, బాధలను తన మీద వేసుకొని, అపవాది క్రియల నుండి మనలను విడుదల చేయుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆలాగునే, మన ప్రభువైన యేసు మీ జీవితములోనికి ప్రవేశించినట్లయితే, అంగీకరించినట్లయితే ఆయన వాగ్దానము చేసినట్లుగానే, ఆయన మీ యొద్దకు వచ్చి మీలో నివసిస్తాడు, మిమ్మల్ని విడువడు ఎడబాయడు. మీరు ప్రభువైన క్రీస్తునందు నీతియైయున్నారు. కారణము, మీ వ్యాధుల నుండి మీరు స్వస్థతను మరియు మీ పాపముల నుండి మీరు విడుదల పొందాలని క్రీస్తు మీ కొరకు తన ప్రాణమును త్యాగము చేసెను. మీ పాపము ద్వారా మీరు నాశనమౌతారనియు, ఆయన మిమ్మల్ని ప్రేమించుట లేదనియు మీరు తలంచవచ్చును. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని తలంచుచున్నాను. " మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి '' (1 కొరింథీయులకు 6:20). ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు కానీ, శిక్షించుట లేదు. కాబట్టి, మీరు తప్పిపోయినను, ఆయన హస్తములు చాపి తిరిగి మీరు ఆయన యొద్దకు రావాలని మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అటువంటి సమయములో మీరు దేవునికి వ్యతిరేకంగా సణగుకొనకండి లేక ఫిర్యాదు చేయకండి. బదులుగా మీరు ప్రభువు పాద సన్నిధిలో మౌనముగా వేచి యున్నట్లయితే, ఆయన నిశ్చయముగా, మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ జీవితములో ఆయన మీకనుగ్రహించిన వాగ్దానముల యందు నమ్మికయుంచండి, దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు.
Prayer:
కృపాతిశయములు కలిగిన మా ప్రేమగల తండ్రీ,

మేము పాపులమై యున్నప్పుడే మమ్ములను ప్రేమించినందుకై నీకు స్తోత్రములు, మా కొరకు సిలువలో శ్రమలను అనుభవించినందుకై నీకు స్తోత్రములు. ఈ గొప్ప ప్రేమ నుండి దూరము కాకుండా, విశ్వాసములో స్థిరముగా నిలువబడుటకు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. యేసయ్యా నీవు మా పాపములను మరియు దోషములను నీ మీద వేసుకున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మా ఘోర పాపములను నీవు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచుము. ప్రభువా, మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, తిరిగి నీ యొద్దకు వచ్చునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000