Loading...
Samuel Paul Dhinakaran

అరణ్యములో మీకొక త్రోవను కలుగజేసే దేవుడు!

Samuel Dhinakaran
14 Apr
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో త్రోవ కనిపించని స్థలములలో దేవుడు మీకు మార్గమును కలుగజేస్తాడు. మనము అద్భుతాలను చూడలేమనుకున్నప్పుడు, ఆయన అద్భుత విధంగా, మన అవసరతలన్నిటిని తీర్చే మార్గమును మనకు కనుపరుస్తాడు. మన ఆత్మ విశ్రాంతిలేనప్పుడు, నీళ్లు పారజేసే దేవుడు. ఆలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని మనము కలిగియున్నాము కదా! మన పట్ల ఆయనకున్న లోతైన ప్రేమను మనము ఎన్నటికి చూడలేము. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎన్నో సవాళ్లును ఎదుర్కొనుచున్న సమయములో ఆయన మీకు అరణ్యములో త్రోవను కలుగజేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. "... నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను '' (యెషయా 43:19) అని మిమ్మల్ని ధైర్యపరచుచున్నాడు. కాబట్టి, దేని నిమిత్తము భయపడకండి. 

ఆలాగున అరణ్యములో త్రోవ చూపించిన ఒక స్త్రీని మనము బైబిల్లో చూడగలము. ఆమె శారాయి దాసియైన హాగరు. ' కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని, ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యా పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, ' హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.' మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి, వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. హాగరు కొరకు దేవుడు అరణ్యములో ఒక మార్గమును ఏర్పరచిన అదే దేవుడు నేడు సమస్యలను ఎదుర్కొంటున్న మీకు ఒక మార్గమును ఏర్పరచును. " నన్ను చూచిన దేవుడు '' అని హాగరు దేవుని స్తుతించినది. మిమ్మల్ని ఎల్లప్పుడు చూచే దేవుడు ఈనాడు మీ సమస్యల నుండియు మరియు ఇబ్బందుల నుండియు మిమ్మును విడిపిస్తాడు. 
ఒకసారి, పిల్లల కోసం ఒక అనాధాశ్రమమును నడిపించుచున్న ఒక దైవ జనుడిని గురించి ఒక పుస్తకములో ఇలా చదివాను. ఒకరోజు ఆ పిల్లలకు ఆహారమును మరియు నీళ్లను కొనుటకు బయటకు వెళ్లెను. కానీ, అతని యొద్ద సరిపడినంత డబ్బులేకపోయెను. అప్పుడు అతడు పర్యవేక్షక (సూపర్వైజర్) బృందమును పిలిచి, పిల్లలందరిని పిలిచి భోజనపు బల్ల చుట్టు కూర్చుని ప్రార్థించమని తెలియజేశాడు. వడ్డించడానికి భోజనము లేకుండా ఎందుకు పిల్లలను ప్రార్థించమని కోరాడో ఆ సూపర్వైజర్కు అర్థం కాలేదు. అటువంటి సమయములో ఎవరో వచ్చి తలుపు తట్టే శబ్దము వినబడినది. అతడు పిల్లలకు ఆహారము ఇవ్వడానికి వచ్చామని తెలియజేశాడు. ఆ సూపర్వైజర్ ఎంతో ఆశ్చర్యముతో, ఇక్కడికి ఆహారమును ఎలా తీసుకొని వచ్చారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అని ప్రశ్నించాడు? అప్పుడు వారు అయ్యా, మేము ఒక విహహాం కొరకు ఆహారమును సిద్ధము చేసి తీసుకొని వెళ్లుచున్నాము. కానీ, మా ట్రక్క్ ఆకస్మాత్తుగా ఆగిపోయినది. దానిని మరమ్మతు చేయడానికి దాదాపు 5 గంటల పడుతుంది. కాబట్టి, ఈ ఆహారమును ఇక్కడున్న పిల్లలకు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పారు. 

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరు సరిదిద్దలేరు. అయితే, మీరు దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టునప్పుడు, ఆయన తప్పకుండా, మీ కొరకు మంచి మార్గమును ఏర్పరస్తాడు. మన మీద తన దృష్టిని మరియు చెవులను నిలిపే దేవుడు. కనుకనే, మీరు ఆయన వాగ్దానముల యందు నమ్మకముంచండి. మీ చెడు మార్గముల నుండియు మరియు పాపపు మార్గముల నుండియు దేవుని వైపునకు తిరగండి, ఉన్న స్థితిలోనే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొన్నట్లయితే, మీ జీవితములో ఉన్న ఆయన ఉద్దేశములు గమనించండి. ఆయన ' యెహోవా యీరే ' మీకు తోడుగా ఉంటాడు. యెహోవా యీరే అనగా ఆయన ' మీ అవసరతలను తీర్చే దేవుడు ' (ఆదికాండము 22:14) అని అర్థము. కాబట్టి, ఈనాడు మీ జీవితములో హాగరు జీవితమువలె ఉన్నది చింతించుచున్నారా? భయపడకండి, హాగరుకు అరణ్యములో త్రోవను కలుగజేసి, ఎడారిలో నదులు పారజేసిన దేవుడు ఈనాడు మీ కుటుంబ జీవితములోను మరియు వ్యక్తిగత జీవితములో గొప్ప అద్భుతకార్యములను జరిగించి, మిమ్మల్ని పరవశింపజేస్తాడు. 
Prayer:
కృపాకనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

దేవా, అరణ్యములో త్రోవను కలుగజేసి మా జీవితాలను మార్చుము. ఎడారిగా ఉన్న మా జీవితాలలో నదులు పారజేయుము. ప్రభువా, మా చెడు మార్గములను మరియు పాపపు మార్గములను విడిచి మేము నీ వైపునకు తిరిగి, ఇప్పుడున్న స్థితిలోనే మమ్మల్ని నీ దివ్యచేతులకు సమర్పించుకొనుచున్నాము. మా జీవితములో ఉన్న నీ ఉద్దేశములను నెరవేర్చుము. ప్రభువా, నీవు మా పట్ల ఈనాటి నుండి ' యెహోవా యీరే ' గా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుము. ఈనాడు మా అవసరతలన్నిటిని తీర్చి మమ్మును దీవించుము. అరణ్యముగా ఉన్న మా జీవితములో నీ కొరకు హాగరు వలె కనిపెట్టుచున్నాము. దయతో మాకు మంచి మార్గమును చూపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000