Loading...
Stella dhinakaran

మీరు అడిగినవన్నియు పొందినవని నమ్మండి!

Sis. Stella Dhinakaran
07 Feb
నా ప్రియులారా, నేడు మన దేవుడు ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు! ఆయన నేటికిని మన మధ్యలో సజీవంగా ఉన్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని సంతోషపెట్టడానికిని మరియు మీ జీవితంలో మృతమైన కార్యములు మరియు పరిస్థితులను మరల పునరుద్ధరిస్తాడు. అందుకే బైబిల్ ఈ విధంగా వాగ్దానము చేయుచున్నది. " అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను '' (మార్కు 11:24) అన్న వచనము ప్రకారము నేడు మీ విన్నపములు ఏవైనప్పటికిని, ప్రేమా స్వరూపియైన మీ పరమ తండ్రి మీ హృదయ కోరికలను తీర్చడానికి మీ కొరకు ఎదురు చూచుచున్నాడు. ఆయన మనలను చూచి, సవాలు చేయుచున్నాడు, " నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా? '' (యిర్మీయా 32:27) అన్న వచనము ప్రకారము నేడు మీ కోరికలు ఏవైనను సరే, ఆయనకు అసాధ్యమైనదేదీయు లేదు. అందువలన, మీ యొక్క క్లిష్టమైన పరిస్థితులను చూచి మీరు నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. విశ్వాసముతో దేవుని అడగండి. ఆయన మీ నమ్మకాన్ని ఘనపరుస్తాడు.

అనేక సంవత్సరాలు ఎదురు చూచి, దేవుని మేలులతో సంతృప్తి చెందిన ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ మీ విశ్వాసం కొరకు. ఒకసారి, " యేసు పిలుచుచున్నాడు '' సువార్త కూటములో, తన కొరతను తీర్చిన ఒక సహోదరి, దేవుని మహిమపరచుచు, వారి సాక్ష్యమును ఈ విధంగా పంచుకొన్నారు. వారికి వివాహమై అనేక సంవత్సరములైనను సంతాన భాగ్యము కలుగలేదు. వైద్య పరీక్షలన్నియు చేసి చూసినప్పుడు, ఆమెకు మరియు ఆమె భర్తకు ఎటువంటి లోపము లేదు అని తెలియ వచ్చినది. అయినను, సంతాన భాగ్యం కలుగలేదు. ఆ తరువాత, వారి కొరకు ప్రార్థించమని కోరుచు, మాకు ఉత్తరము వ్రాశారు. మేము ప్రార్థించి, వారికి జవాబు వ్రాసి పంపించాము. దేవుడు తన మహా కృపతో ప్రార్థనను ఆలకించి, ఆ సహోదరి గర్భమును ముట్టెను. 14 సంవత్సరముల వివాహ జీవితము తరువాత, ఒక చక్కటి ఆడపిల్లను ప్రభువు వారికి అనుగ్రహించి, ఆశీర్వదించాడు. ఆ తరువాత వారు ఆ బిడ్డను తీసుకొని వచ్చి, " మీ ప్రార్థన ద్వారానే ఈ బిడ్డ జన్మించినది '' అని ఎంతో సంతోషముతో చూపించినప్పుడు, మా హృదయము ఎంతో పరవశించిపోయినది. దేవునికి మా హృదయ పూర్వక కృతజ్ఞతా స్తుతులు చెల్లించాము. దేవునికే మహిమ కలుగును గాక!
నా ప్రియ సోదరీ, సోదరులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ విన్నపములు ఏవైనను సరే, దానిని అనుగ్రహించుటకు, ప్రేమగల మీ పరమ తండ్రి సిద్ధముగా ఉన్నాడు. అవును, మీరు కూడా విశ్వాసంతో దేవుని అడగవచ్చును. ప్రభువు ఒక్కడే, " మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి స్తోత్రము '' (ఎఫెసీయులకు 3:20) అన్న వచనము ప్రకారము మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి దేవుడు తన యొక్క శక్తిని తగిన సమయంలో మీ పట్ల బయలుపరుస్తాడు. ఈ రోజు వాగ్దానం ప్రకారము, " మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురు '' (మత్తయి 21:22) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుటకు దేవుడు మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు. అవును, ప్రభువు మన ప్రార్థనలను మరియు విన్నపములను వినుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రార్థించునప్పుడు, ఏవి అడుగుచున్నారో, వాటినన్నిటిని పొందుకున్నారని నమ్మండి, అప్పుడు మీ జీవితంలో అద్భుతాలను పొందుకుంటారు. ఈ విధంగా వాగ్దానం చేసిన యేసయ్య సమస్త మేలులతో మిమ్మును నింపుతాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములోని కొరతలన్నిటిని తొలగించి, మిమ్మును ఆనందింపజేస్తాడు.
Prayer:
ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశక్తిగల మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా ప్రార్థనలను వినుచున్నావని మేము విశ్వసించుచున్నాము. మేము నీ అద్భుత కార్యాలను గూర్చి సందేహించినందుకు విచారిస్తున్నాము. నీవు మా జీవితములో అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటకు మాలో నీ బలమైన విశ్వాసమును దయచేయుము. అవిశ్వాసము ద్వారా మేము పాపులముగా ఎంచబడుచున్నాము. మా జీవితంలో నిన్ను విశ్వాసముతో వెదికే దివ్య కృపను మాకనుగ్రహించుము. దేవా మాకు అవగింజంత విశ్వాసమును అనుగ్రహించుము. మేము ఎల్లప్పుడు నీలో విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. కొండను పెకలింపగలిగే విశ్వాసాన్ని మాకనుగ్రహించుము. మరణించిన వారిని సహితము లేపిన దేవుడవని మేము నమ్ముచున్నందున మాలో ఉన్న వ్యాధులు, సమస్యల నుండి విడిపించి, మాకు అద్భుతములు చేయుమని అద్భుతాలు చేసే యేసయ్యా నిన్ను బ్రతిమాలుకొను చున్నాము. ఈ లోకాన్ని జయించే విశ్వాసాన్ని మాకు దయచేయుము. మా ప్రార్థన విన్నపముల నిమిత్తము ఈ దినము నిన్ను గట్టిగా పట్టుకొని, నీ యందు మాత్రమే విశ్వాసముంచుటకు కావలసిన అటువంటి కృపను మాకు దయచేయుమని ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000