Loading...
11 Oct
1. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత 

2. నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు, 

3. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. 

4. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. 

5. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికి వేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. 

6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.

7. మీరు సర్వజనముల కంటె విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. 

8. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించెను. 

9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరముల వరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. 

10. ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును 

11. కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకొనవలెను. 

12. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. 

13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును. 

14. సమస్త జనములకంటె ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికేగాని ఆడు దానికేగాని గొడ్డుతనముండదు, నీ పశువులలోనైననుండదు. 

15. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరిమీదికే వాటిని పంపించును. 

16. మరియు నీ దేవుడైన యెహోవా నీకప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును. 

17. ఈ జనములు నాకంటె విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకొందువేమో, వారికి భయపడకుము. 

18. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు 

19. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును. 

20. మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. 

21. వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు. 

22. నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరముకాదు. 

23. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయువరకు వారిని బహుగా తల్లడిల్లచేయును. 

24. ఆయన వారి రాజులను నీ చేతికప్పగించును. నీవు ఆకాశముక్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకపోవును. 

25. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. 

26. దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.
Telugu