Loading...
Stella dhinakaran

దేవుని యందు నిరీక్షణ గలవారి మీద కృప విస్తరించును!

Sis. Stella Dhinakaran
11 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని కృపను పొందుకొని జీవించాలని ఆయన మీ పట్ల వాంఛించుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది '' (కీర్తనలు 33:19) అన్న వచనము ప్రకారము మనము ఎదుర్కొనుచున్న బాధలను బట్టి దేవుడు మనలను విడిచి పెట్టాడని క్షణమాత్రములోనే మన ప్రేమగల తండ్రియైన దేవునికి విరోధముగా సణగుకుంటాము. అయితే, వాక్యము ఇలా తెలియజేయుచున్నది, " భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది '' (కీర్తనలు 32:10) అన్న వచనము ప్రకారము బాధలను ఎదుర్కొంటున్నప్పుడు, ఆయనకు విరోధముగా సణుగుకొనకుండా, ఆయన యందు నమ్మిక యుంచినట్లయితే, తన కృపను మీ మీదికి దిగివచ్చునట్లు చేస్తాడు. కాబట్టి, మీరు సంపూర్తిగా దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే, దేవుని కృప మీ మీదికి దిగిరావడం మీరు చూచెదరు. " ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను '' (రోమా 5:21) అను వచనము ప్రకారము ఒకవైపు పాపం విస్తరిస్తుంటే, మరొక వైపు దేవుని కృప కూడ విస్తరిస్తుందని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. దేవుని కృప మీ యందు విస్తరించుటకు మరియు ఆయన యొక్క అద్భుతమైన విమోచన పొందుటకు ప్రభువు మనకు మార్గము చూపును. 

ఒక యౌవనుడు వ్యభిచారమందు కూరుకుపోయాడు. దాని పర్యవసానం తెలియకుండానే పాపానికి బానిసైపోయాడు. కానీ, ఆ అలవాటు నుండి బయటకు రావాలని ఎంతో ప్రయత్నించాడు. ఇతని గూర్చి విన్న ఒక మంచి వ్యక్తి అతని కొరకు ప్రార్థించి, వాక్యానుసారముగా సలహా ఇచ్చాడు. ఆ యౌవనస్థునితో కలిసి ఆ పెద్ద మనిషి ప్రార్థన చేశాడు. కొన్ని రోజులు గడవగా. ఆ యౌవనుడు దేవుని జ్ఞానాన్ని తెలిసికొని క్రమంగా దైవ భక్తిలోనికి వచ్చాడు. వ్యభిచార మనస్సు నుండి విడుదల పొందాడు. అతని జీవితంలో నుండి వ్యభిచారం మాయమైనది. ఆ పెద్ద మనిషి ఆ యౌవనుడితో చాలా సమయం గడిపి దేవుని మార్గాన్ని గూర్చి విశదపరిచాడు. దేవుని " కృప '' ఆ యౌవనుడి మీదికి దిగివచ్చింది. క్రమంగా అతడు ప్రతి దురలవాటుల నుండి విడుదల పొందాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చివరికి అతని మనస్సు, ఆత్మ పరలోక నిత్యజీవాన్ని సంతరించుకున్నవి. అతడు దేవునికి మంచి సాక్షిగా జీవించాడు. 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ వంకర మార్గములను ప్రభువు సరాళము చేయును. మీ భవిష్యత్తును గురించి నిరంతరము ఆందోళన చెందుచున్నప్పుడు, మీ జీవితములో సమాధానము లేకుండా పోవచ్చును. కానీ, దేవుడు మీ కోసం ఒక మార్గమును ఏర్పరచి యున్నాడు. సమస్తాన్ని మీకు సరిచేసి, ఆనందమును అనుగ్రహిస్తాడు. నీతిగల దేవుడు మీ ముందు నడుస్తూ, మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ప్రభువు యొక్క మహిమ మీ వెనుక నుండి మిమ్మల్ని రక్షించును. ఈ దీవెనను దేవుడు ఎలా ఇస్తాడు? ఆయన యొక్క కృపతో నిండియున్న జీవితమును మీకు అనుగ్రహిస్తాడు. మీరు దేవునికి భయపడి, ఆయన మార్గాలలో నడిస్తే ఆశీర్వదింపబడతారు. దేవుడు తనకు భయపడే యౌవనులు మరియు పెద్దలను ఆశీర్వదిస్తాడు. మీరు ఆయనకు భయపడినప్పుడు, ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు మరియు మీరు ఆయన నామమునకు సాక్ష్యులుగా నిలబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ!

ఈ పాపపు లోకములో మేము పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సహాయం చేయుము. దేవా, పై చెప్పబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి, అతనిని నీ మేలులతో నింపినావు. కనుకనే మంచి సాక్షి జీవితమును కలిగి అతను నిన్ను మహిమపరిచాడు. అదేవిధంగా, నీ కృపతో మమ్ములను నింపుము మరియు మేము నిన్ను యథార్థముగా వెంబడించుచు, నీకు గొప్ప సాక్ష్యులుగా జీవించుటకు భారము కలిగియుండుటకు మాకు మారుమనస్సు దయచేయుము. మా భవిష్యత్తును గురించిన ఆందోళనను తొలగించి, మాకు గొప్ప సమాధానమును దయచేయుము. ఎటువంటి స్థితిలోనైనను మేము నీకు విరోధముగా సణగకుండా, నీ యందు నిరీక్షణ కలిగి జీవించునట్లు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000